top of page

అనునయం

Updated: Jul 11, 2022

ట్రైన్ దిగి మెల్లగా ప్లాట్ఫారం మీద అడుగులు వేస్తున్న నాకు అస్తమించే సూర్యుని వెచ్చదనానికి చల్లని శీతాకాలపు గాలులు తోడై రమ్మని వెచ్చని స్వాగతం పలుకుతున్నట్టు అనిపించింది. అదేంటో.. పుట్టిన అభిమానమో, పెంచుకున్న ప్రేమో.. ఊర్లోకి దిగగానే అమ్మ ఒడిలో ఉన్నంత హాయి. శరీరంలోని ఆణువణువూ ఆత్రంగా దాహం తీర్చుకున్న అనుభూతి, గమ్యానికి చేరుకున్నాను అనే ప్రశాంతత పెదవులపై చిన్న చిరునవ్వుని తెచ్చింది. అనుకోలేదు .. ఇలా రాగలను అని. మాది పల్లెటూరు కాదు, అలా అని సిటీ కూడా కాదు. ఒక పెద్ద టౌను. అమ్మానాన్నా పోయాక ఉన్న ఇల్లు ఉన్న కాస్త పొలం .. చూసుకోరా అంటూ నా చిన్ననాటి స్నేహితుడు సత్యం చేతికి అప్పగించి .. నేను విదేశాల్లో స్థిరపడిపోయాను.


సత్యం.. పేరుకు తగ్గట్టే చాలా సత్యవంతుడు, సాత్వికుడు. సంతోషం, సుఖం అనే పదాలకు అర్ధం వాడి నుంచి నేర్చుకోవాలి ఎవరైనా. ఎలెక్ట్రిసిటీ బోర్డులో పై పదవుల్లో పనిచేసి యాభయ్యేళ్ళకే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని, ఇప్పుడు అందరు పాటిస్తున్న సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు. నా పొలం కూడా కలిపి వాడే సాగు చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఫోటోలు పంపిస్తాడు వాట్సాప్ లో ‘చూడు నీ నేలను ఎలా బంగారంలా మార్చానో’ అంటూ. ఆర్గానిక్ స్టోర్స్ అదీ పెట్టాడు ఊర్లో. వాడంటే చాల ఇష్టం నాకు. నేను ఒక్కడినే మా అమ్మ, నాన్నకి. తోడబుట్టిన వాళ్ళు లేని లోటు గత యభయ్యేళ్ళుగా తీరుస్తూనే ఉన్నాడు. వాడూ నేను ఇదే ఊర్లో పుట్టాం, పెరిగాం, కలిసి చదువుకున్నాం. వాడికో కూతురు. ఎప్పుడో పుట్టినప్పుడు చూసాను చంటిదాన్ని. పెద్దయ్యాకా ఫోటోలలో చూడటమే. వాడి భార్య .. విధేయ కూడా స్కూల్ నుంచి కాలేజీ వరకు నా క్లాస్మేటే. వీడు మాకు సీనియర్. ముగ్గురం మంచి స్నేహితులం. అందమైన బాల్యం, ఇంకా అందమైన యవ్వనం.


సత్యం వచ్చాడు మంచి కార్లో.. పిక్ అప్ చేసుకోడానికి. గట్టిగ హతుకున్నాను అభిమానంతో. నన్ను పై నుంచి కింద వరకు చూసి.. చాల స్మార్ట్ గా ఉన్నావురా.. నీకు యాభయ్ అంటే ఎవ్వరూ నమ్మరు. 'ఇన్నేళ్ళకా వచ్చేది?' అన్నాడు కాస్త మొహం మాడ్చుకుని. నవ్వాను ... గుండెల్లో ఎగసిపడుతున్న కెరటాలని అణుచుకుంటూ. నడు .. విధేయ నా బుర్ర తినేస్తోంది 'అర్జున్ ఎప్పుడొస్తాడు' అంటూ. నా మీద ఏవేవో చాడీలతో పెద్దలిస్టు రాసిపెట్టుకుంది .. నీతో చెప్పడానికి. పాతికేళ్ళ బాకీ మరి, విందువు గాని తీరికగా అన్నాడు.


చాల పెద్ద భవనం వాడి ఇల్లు. పోర్టికో, మంచి లాన్, మందీమార్బలం. సాధించే తపన ఉంటే ఎక్కడయినా సాధించచ్చు అనేవాడు సత్యం. ఆ మాట వాడి విజయాన్ని చూస్తే అర్ధం అయ్యింది. పరిగెత్తుకుంటూ వచ్చింది వాడి కూతురు .. తరుణి. ఎంత పెద్దదయ్యిందో. ఆవిడ ఇప్పుడు ఓ డాక్టర్ కూడా .. ఆశ్చర్యమేసింది. అసలు నేనొచ్చి పాతికేళ్ళు అవుతోందన్న విషయమే మరచిపోయాను. 'బాబాయ్' అని అది, 'అర్జున్.. ఎలా ఉన్నావు' అంటూ విధేయ ఎంతో అభిమానాన్ని చూపించారు. నా అనే వాళ్ళ ఆప్యాయత కరువైన నాకు కళ్ళల్లో నీళ్ళు ఉబికాయి. లోపలి తీసుకెళ్ళారు. 'చీకటి పడుతోంది అర్జున్, స్నానం చేసిరా వేడిగా వడ్డించేస్తాను', అంటూ విధేయ టేబుల్ రెడీచేయడం మొదలుపెట్టింది. తరుణి నాకు ఇల్లు, వాకిలి .. అన్నీ చూపిస్తోంది. ఫ్లైట్ ఎక్కింది మొదలు ఇప్పటి వరకు నాలుగు రోజుల ప్రయాణంతో శరీరం బాగా అలిసిపోయింది. ఈ జెట్లాగ్ ఒకటి .. ఒళ్ళు ఇంకా ఆ మోషన్ లోనే ఉంది. ఏం తిన్నానో .. ఎప్పుడు పడుకున్నానొ ఒళ్ళు తెలియలేదు.


పొద్దున్న ఏడింటికి సత్యం లేపాడు.