top of page

దైవం మానుష రూపేణా

నాకు ఫస్ట్ పోస్టింగ్ బెంగలూరులో వచ్చింది. మా ఊరి నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉండేది కాదు. ఉద్యోగంలో జేరిన కొన్ని నెలలకి నా పెళ్లి కుదిరిందని మొదటి సారి బెంగలూరు నుండి మా ఊరు బయలుదేరా. అప్పటి దాకా సెలవు ఇచ్చిందే లేదు ఆఫీస్ వాళ్ళు. మా ఊరికి గంట దూరంలో ఉండే వేరొక టౌనులో ట్రైన్ దిగి, కార్ లో మా ఊరు వెళ్ళాలి.


మా అమ్మ భయపడింది, ఆడపిల్ల ఎలా వస్తుందో ఒకర్తే అని. అలా అని ఎప్పుడూ అమ్మ, నాన్న వెనక వెనక వచ్చింది లేదు. అన్నిమా అంతట మేము స్వతంత్రంగా చేసుకునేలానే పెంచారు. నేను స్కూలుకి సెవెంత్ క్లాసు మొదలు డిగ్రీ ఆఖరి సంవత్సరం వరకు సైకిల్ మీద వెళ్ళేదాన్ని. మా అమ్మ ప్రేమ, భయం ఎంతలా ఉండేవంటే, ఆ తొమ్మిది సంవత్సరాలు ఒక్క రోజు కూడా మర్చిపోకుండా చెప్పేది, జంక్షన్లో చూసుకో, ఎవరైన అడ్డొస్తే బెల్లు కొట్టు, ఫాస్ట్ గా తోక్కకు, రోడ్ కు ఒక పక్క మెల్లగా వెళ్ళు, అంటూ ఇదే పాట రోజూ. ఎన్ని సార్లు చెప్తావే అమ్మ అంటే, ఎన్ని సార్లు అయినా చెప్తాను, నాకు నీ సేఫ్టీ ముఖ్యం అనేది.


ఇలా ట్రైను ఎక్కానో లేదో మా అమ్మ ఖంగారు మొదలయ్యింది. ఫోనులో జాగ్రత్తలు, “ఎవరైనా ఆడవాళ్ళూ ఉన్నారా భోగిలో, వాళ్ళ పక్కనే ఉండు, ఎవరు ఏమి పెట్టినా తినకు, ఒళ్ళు తెలియకుండా పడుకోకు, కూపేలో మగవాళ్లు మాత్రమే ఉంటె, ఆడవాళ్ళు ఎక్కడ ఉంటె అక్కడే టీటీని రిక్వెస్ట్ చేసి కూర్చో, ఇలా ఎన్నో ఎన్నో మరెన్నో. అబ్బ, ఏంటే అమ్మా అంతలేసి ఉహాగానాలు. ఎక్కడైనా ఇంటర్-స్టేట్ ఎక్స్ప్రెస్ లో మగవాళ్ళు మాత్రమే ఉంటారా. ఏం ఆడవాళ్ళు అయితే హాని చేయరా అది అడిగా. వాదించకుండా చెప్పింది విను అంది అమ్మ. నవ్వుకున్నా, మా అమ్మ అర్ధం లేని భయానికి. ఇంకా స్కూల్ పిల్లలానే చూస్తోంది నన్ను అనుకుంటూ సెటిల్ అయ్యా ట్రైన్లో. రాత్రి ప్రయాణం బానే గడించింది. మా అమ్మ కోరిక ప్రకారమే నా కూపే నిండా ఆడవాళ్ళు. తెచ్చుకున్న డిన్నర్ తినేసి, బెర్త్ పైకెక్కి నిద్రపోయా.


అర్ధ రాత్రి పన్నెండు అవుతోందేమో, బాత్రూంకి లేచి వెళ్ళేటప్పుడు, నిద్ర మత్తులో పెద్దగా గమనించలేదు. వచ్చి మళ్ళీ బెర్త్ ఎక్కుతుంటే తల తిప్పి చూసేసరికి నా కూపేలో నలుగురు మగవాళ్ళు తప్ప ఎవరూ లేరు. భోగి మొత్తంలో కూడా అక్కడ ఇక్కడ ఇద్దరో ముగ్గురో మాటలు వినిపించాయి లీలగా. గుండెల్లో ఒక్క సెకను భయం వేసింది ఆ నిశబ్దానికి. పడుకున్నా నేను ఏమి ఆలోచించకుండా. ఆఫీసులో ముందు రోజు పనికి ఒళ్ళు తెలియలేదు. మళ్ళీ మెలకువ వచ్చి చూసేసరికి, తెల్లవారుఝాము అయిదు చూపిస్తోంది నా సెల్ ఫోను. నేను దిగాల్సిన స్టేషన్ కి ఇంకా రెండు గంటల పైనే టైముంది. యధాలాపంగా తల తిప్పి చూసా కిందకి. ఎదురుగా ఉన్న లోయర్ బెర్త్ మీద అదే నలుగురు మగవాళ్ళు నాకేసే చూస్తూ ఉన్నారు. వస్తాదుల్లా , ఎర్ర్రని కళ్ళు, భయమేసే ఆహార్యంతో ఉన్నారు. నా గుండె గతుక్కు మంది. వీళ్ళు నిజం గానే ఉన్నారా, కల కాదా? ఇంకా వెళ్ళలేదేంటి, కుర్చుని ఉన్నా కూడా నాకేసే అలా చుస్తున్నరేమిటి అనుకున్నా.


నాకు ఇలాంటి విషయాల్లో భయం తక్కువే అయినా, రాత్రి అమ్మని హేళన చేసానే అందుకే ఇలా అయ్యింది, అనుకుని మళ్ళీ దుప్పటి ముసుగేసేసా. ఏవేవో ఆలోచనలు, భయాలు. ఎవరికి ఫోన్ చేసి ఎం లాభం, కదిలే ట్రైన్ లో. ఎంత సేపని ఆపుకునేది, మళ్ళీ బాత్రూంకి వెళ్ళాలి. ఇంక తప్పదు అనుకుని లేచి, మెల్లగా దిగి బాత్రూంకి వెళ్ళొచ్చి కూర్చున్నా.