top of page

వర్షం కురిసిన రాత్రి

Updated: Apr 8, 2022

ఇవాళ తుఫాను అని రోజంతా కరెంట్ తీసేసాడు. చాలా రోజులయ్యింది ఇలా కొవ్వొత్తుల వెలుగులో సాయంత్రం గడిపి. మెల్లగా వీస్తున్న చల్లని గాలులు మనసులోతుల్లో మరుగున పడిన చిన్ననాటి మధుర జ్ఞాపకాలను తట్టి లేపాయి. అవి ఎంతో మధురం అని ఇప్పుడు అనిపిస్తోంది.

ఇలానే ఒకసారి పెద్ద గాలివాన వచ్చి ఒక వారం పాటు విద్యుత్ సరఫరా లేకుండా గడపాల్సి వచ్చింది. అప్పుడు పెద్దగా ఇబ్బంది పడిన గుర్తు లేదు. ఇప్పుడు రాసిన పదాలకు సరిగా అర్థం కూడా తెలియని వయసు. కానీ నీకు నేను ఉన్నాను అనే ధైర్యం ఇచ్చే అక్క ఉండటంతో ఆ పెను గాలులు కూడా ఆట విడుపు అయ్యాయి. కానీ అమ్మ భయపడింది. ఫెళ ఫెళ లాడే ఉరుములు విన్నప్పుడల్లా మా భయం కంటే అమ్మ భయపడుతుందేమో అనే ఖంగారు ఉండేది. తను పుట్టినప్పుడు, ఆసుపత్రి బయట పెద్ద పిడుగు పడి చెట్టు కాలిపోయిందని మా అమ్మమ్మ చెప్పేది. బహుశా అందుకేనేమో ఎప్పుడు ఆకాశం ఉరిమినా భయపడేది.


ఆ వారంలో పగటి పూట అమ్మ ఇంటి పనులతో, మేము స్కూలుకి, నాన్న బ్యాంకుకు వెళ్ళి గడిపేసినా సాయంత్రం అయ్యేసరికి గూటికిచేరిన పక్షుల్లా అందరం వరండాలోకి చేరిపోయే వాళ్ళం. అందరం అంటే మేము నలుగురమే. అదే మా ప్రపంచం. అప్పుడు మోదలయ్యేది మా అసలు కథ. కాస్త చీకటి పడే వరకూ నాన్న పాటలతో, మా అల్లరికి పడే అమ్మ చీవాట్లతో, సరదా కబుర్లతో కాలక్షేపం చేసేవాళ్ళం. భోజనాల వేళ అవ్వగానే ఆ వెన్నెల వెలుగులో, మేము నాన్నతో కలిసి కంచాలు, గ్లాసులు సర్దగానే అమ్మ కరకరలాడే వేపుళ్ళు, ఘుమ ఘుమ​ లాడే ఇంగువ చారుతో వేడిగా అన్నాలు వడ్డించేసేది. ఆవకాయ ఉండనే ఉండేది. అది యే పూట అయినా ఉండాల్సిందే. హమ్మయ్య ఈ రోజు గడిపేసాం అనుకునేంతలో పిలవని పేరంటంలా దోమల బెడద మోదలయ్యేది. యుద్ధానికి సన్నద్ధం అయ్యే సైనికుల్లా అమ్మ, నాన్న వాళ్ళ ఆయుధాలతో బయలు దేరేవారు. టార్టాయ్స్ కాయల్సు మాకు పడవని, నాన్న ముందు ఆయన పంచెతో మా పాదాలకు అంటిన దుమ్ము తుడిచి, కొబ్బరి నూనెలో కాస్త జండూబామ్ కలిపి పట్టించేవారు. అమ్మ తాటాకు విసనకర్ర తో ఏ మాత్రం విసుగు లేకుండా విసిరేది. కమ్మని నిద్ర అంటే అదే. మేము నిద్ర పోయాకా వరండా లోంచి మమ్మల్ని ఎత్తుకుని లోపకెళ్ళి, తలుపులు వేసుకుని, వాళ్ళు నిద్ర లోకి జారుకునే వారు.


ఇవాళ ఈ తుఫాను వల్ల ఇంటర్నెట్ పనిచేయక, ఏం చేయాలో తెలియక బిక్క మొహం వేసిన నా సుపుత్రుడ్ని, వాతావరణంతో సంబంధం లేకుండా ఫోను ఊదరగొట్టేస్తున్న మా ఆయన్ని చూసి నవ్వుకుని, ఈ జ్ఞాపకాలను రాస్తున్నా.


చేయి చాచి వాన చినుకులని, తడిసిన మట్టి వాసనని ఆస్వాదిస్తుంటే, మా ముగ్గుర్నీ వదిలి విశ్వాంతరాళాల్లోకి వెళ్ళన తిరిగిరాని మా అమ్మ ముద్దు పెడుతున్నట్టే అనిపించింది. జీవితాన్ని చూడాల్సింది, చదవాల్సిందీ చాలానే ఉన్నా, గతం ఎన్నో అగాధాలను మిగిల్చింది. ఇంకా ఎన్ని వర్షపు రాత్రులు ఎదురైతే ఇలా గతాన్ని నెమరు వేసుకునే అవకాశం వస్తుందో అని ఆలోచిస్తూ బరువెక్కిన గుండె లతో... అమ్మా అని పిలుపు వినపడగానే.... నా చిన్న ప్రపంచంలోకి తిరిగి వచ్చాను.;;;;