top of page

సంక్రాంతి

Updated: Apr 8, 2022

చీకటి పడుతుండగా అకాల వర్షపు చినుకులు. గుప్పుమని మట్టి వాసన. ఆశ్చర్యం వేసింది, చుట్టుపక్కల ఇంకా ఎక్కడో మట్టి ఉందే అని. కాలం ఎంత మారిపోయిందో. అపార్ట్మెంట్లు వచ్చాక ఈ చిన్న చిన్న సరదాలు మరుగున పడిపోయాయి. నాలుగ్గోడల మధ్య జీవనం, ఎక్కడికెళ్ళినా కారో, ఫ్ఫ్లయిటో ఎక్కి తిరిగి మళ్ళీ అదే నాలుగ్గోడల మధ్యకి రావడం.


మా చిన్నతనంలో మేము ఉన్న ఇళ్ళన్నిటికీ ముందు రోడ్డు వెనుక పెరడు ఉండేవి. వచ్చే పోయే జనం, పెళ్ళిళ్ళు, పేరంటాలు, పండుగలు పబ్బాలు, అడపా తడపా కుటుంబంలో దుర్ఘటనలు. సంవత్సరాలు దొర్లిపోయేవి. ఇప్పుడు రోజులు గడుపుకోవలసిన పరిస్థితి. ఆలోచిస్తే అదంతా గతంలా కాకుండా గత జన్మలా అనిపిస్తుంది. ప్రతీ నెలాఖరున వచ్చిన ఇన్విటేషన్ కార్డులన్నీ ఎం చేయాలా అని మా అమ్మ తలపట్టుకు కూర్చోవడం గుర్తు. అన్నిటి మీద దేవుడి ఫొటోలే మరి. పెళ్ళయ్యి దశాబ్ద కాలం దాటుతున్నా నాకొచ్చిన శుభకార్యాల పిలుపులు వేళ్ళ మీద లెక్క్ఖపెట్టవచ్చు. విస్తరిలో వడ్డించిన పిండి వంటలన్నీ ఎవరు ముందు తింటారా అని మా దాయాదులు పోటీలు పెట్టుకున్న రోజుల నుంచి, ఎవరు ఏ శుభకార్యానికి పిలుస్తారా మంచి విందు భోజనం తినచ్చు అనేవరకు వచ్చింది. వండుకోలేకో, వండుకోకో కాదు, అదొక సరదా. ఆ సందడీ, హడావిడీ, కబుర్లు, ఒకటి కాదు. ఇంటర్నెట్లో చూసి రోజూ పిండి వంటలే, పండుగకి బట్టలు పోయి ఏడాది పొడుగునా ఆన్లైన్ షాపింగే.


రేపు సంక్రాంతి. ఆవు పేడ, మట్టి, గడ్డి పరకలు కలిపి పిడకలు చేసేది అమ్మ. భోగి నాడు తెల్లవారుఝామునే లేచి, స్నానాలు చేసి, కొత్త బట్టలు వేసుకుని ఆ పిడకల దండలు భోగి మంటలో వేయడం, ఆ సెగల వల్ల వచ్చిన వెచ్చదనంతో చలి కాచుకోవడం ఇంకా గుర్తు. మరునాడు సంక్రాంతి కోసం పెద్ద రంగుల ముగ్గు వేసిన విజయోత్సాహం ఒక పక్క విర్ర వీగుతున్నా, కాళ్ళ నొప్పులతో పెందరాళే మంచాలు ఎక్కేవాళ్ళం. సంక్రాంతి రోజున ఇంట్లో చేసిన వంటలు అన్నీ తిని, అవి అరిగేదాక ఆటలు ఆడేవాళ్ళం. తప్పక వెళ్ళాల్సిన గొబ్బిళ్ళ పేరంటాలు, మొహమాటంతో పాడిన ఆ గొబ్బిళ్ళ పాటలు, కనుమ నాడు వీధుల వెంట పాకే రధం ముగ్గులు కనుమరుగే అయ్యాయి. ఇప్పుడు పండుగ అంటే ఎప్పుడు ఆర్డర్ ఇచ్చేవి కాకుండా స్విగ్గి లో స్పెషల్ ఆర్డర్లు ఇవ్వడం, అమెజాన్, హాట్ స్టార్ లో సినిమాలు చూడటం, కొత్త బట్టలేసుకుని సేల్ఫీలు దిగటం, వాట్స్ ఆప్ లో విషెస్ చెప్పుకుని మురిసిపోవడం.


మనుషులు, వారి పోకడలు మారిపోయాయి. ఇప్పుడు ఎదో మనస్తత్వ శాస్త్రం చుదవుకున్నా అని కాకపోయినా రోజులు మారేకొద్దీ స్వార్ధం, సంకుచిత మనస్తత్వం అనేవి ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయి. నేను, నాది, నా ప్రపంచం అనేవే నినాదాలు. నేనేదో వీటికి అతీతురాల్ని అని కాదు కానీ నేను పెరిగిన ఊరు, మనుషులు, గాలి అన్నీ స్వచ్చమైనవే మా గోదారి తల్లితో సహా. రోజంతా స్కూలు, కాలేజీ, ఆఫీసులతో విసుత్తిగెపోయి సాయంకాల వేళ, ఐనవారితో నది ఒడ్డున కూర్చుని తినుబండారాలు తింటూ, ఆ గాలితో కబుర్లు చెప్పుకుంటే మనసు దూదిపింజలా ఎగిరిపోయేది. ఇప్పుడు రోజూ ఇంటి ఎదురుగా ఉన్న ఉదయించే సూర్యుడు, ఎగసి పడే కెరటాల కడలి, దాని పైన మెరిసే వెన్నెల ఆదరణ లేక వాటి పని అవి చేసుకు పోతున్నాయి.

గడిచిన కాలపు మధురానుభూతులను నెమరువేసుకుంటూ...